తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండి పదిరోజుల క్రితం భూమి మీదకు తిరిగి వచ్చిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎట్టకేలకు తన ఇంటికి చేరుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు మూడు నెలల ముందు నాసాలో ట్రైనింగ్ మొదలుపెట్టిన సునీతా ఆతర్వాత 9 నెలల పాటు స్పేస్ లోనే గడిపారు. తిరిగి భూమి మీదకు నచ్చినా ఆమె వెంటనే నడిచే పరిస్థితులు లేకపోవటంతో నాసా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ తీసుకున్నారు. దాదాపు పదిరోజుల విశ్రాంతి తర్వాత ఫైనల్ గా ఇంటికి చేరుకున్న సునీతా విలియమ్స్ కు ఆమె భర్త మార్షల్ విలియమ్స్ సాదర స్వాగతం పలికారు. అయితే అంతకంటే ముందే ఆమె రెండు పెంపుడు కుక్కలు అమాంతం సునీతా విలియమ్స్ పైకి ఉరికేశాయి అంతే. తన రెండు పెట్ డాగ్స్ అంటే తనకు ప్రాణం అని గతంలో ఎన్నో సార్లు చెప్పిన సునీతా విలిమయ్స్ స్పేస్ లో తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయినప్పుడు కూడా వాటి గురించే బెంగగా ఉందని చెప్పారు. గన్నర్, కట్టర్ అని తన పెంపుడు శునకాలకు పేర్లు పెట్టుకున్న సునీతా విలియమ్స్ వాటిని చూడగానే ఎమోషనల్ అయిపోయారు. బ్యాగ్ పక్కన పడేసి వాటితో ఆడుకుంటూనే లాన్ లో చాలా సేపు గడిపారు. కట్టర్ తన నోటితో ఓ స్టిక్ తీసుకువచ్చి వెల్కమ్ చెప్పగా...గన్నర్ అయితే పూర్తిగా సునీతా విలియమ్స్ ప్రేమగా ముద్దులతో ముంచెత్తింది. ఈ క్యూట్ వీడియోను ది బెస్ట్ హోమ్ కవరింగ్ ఎవర్ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సునీతా విలియమ్స్ .